English | Telugu
రైతుల ఆందోళనతో దిగొస్తున్న కేంద్రం! వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సుముఖం?
Updated : Dec 9, 2020
మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది. బంద్ కు పలు రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. పలు రాష్ట్రాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. రైతులతో పాటు పలు పార్టీల రాజకీయ నాయకులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
భారత్ బంద్ తో కేంద్ర సర్కార్ లో కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య బుధవారం చర్చలు జరగాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగానే అమిత్ షా రైతు నాయకులతో సమావేశమయ్యారు. అయితే ఈసారి కూడా రైతులు ప్రభుత్వం ప్రతిపాదనలను అంగీకరించలేదు. దీంతో బుధవారం జరగాల్సిన చర్చలను రద్దు చేశారు. అయితే సవరణలకు సంబంధించిన అంశాలను బుధవారం లిఖితపూర్వకంగా అందిస్తామని, వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని అమిత్‌షా సూచించారు. దీనికి రైతులు అంగీకరించినట్లే కన్పించింది. సవరణల జాబితాను ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందించిన తర్వాత సింఘ సరిహద్దులో 40 రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమై.. కేంద్ర సర్కార్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఆ తర్వాతే ఆందోళన కొనసాగిస్తారా లేక కేంద్రంతో చర్చలకు వెళతారా అన్నది నిర్ణయించనున్నారు.