English | Telugu

ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు.. త్వరలో ప్రధానిని కూడా!

అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. రాజధాని కోసం రైతుల ఆందోళనలు, రైతుల పట్ల పోలీసుల తీరును వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ‘రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చాం. ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. తాము ఆందోళన వ్యక్తం చేస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు’ అంటూ రైతులు తమ గోడుని ఉపరాష్ట్రపతికి వినిపించారు. రాజధాని తరలిపోకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా సూచించాలని కోరారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ దొరికితే రైతులు ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.