English | Telugu

తెలంగాణలో మరోసారి ఎన్నికల జోరు.. గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం!

మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసి టిఆర్ఎస్ కారు జోరు కొనసాగుతొంది.ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు సమాచారం. రైతులు సభ్యులుగా ఉండే సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్ లకు నియమించిన పర్సన్ ఇన్ చార్జ్ ల పదవీ కాలం ముగుస్తున్న మేరకు 3-4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు.15ను రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని, కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు అధికారులు.

రాష్ట్రంలోని సహకార సంఘాలకు 2018 లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ మేరకు సంఘాల పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్ చార్జి లను నియమించారు. వారి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించింది.పర్సన్ ఇన్ చార్జిల పాలన పొడిగింపునకు అవకాశం ఇవ్వకుండా ఎన్నిక లకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.రాష్ట్రంలో 584 మండలాలకు గాను 906 సహకార సంఘాలే ఉండేవి. మండలాల సంఖ్య పెరిగాక 81 మండలాల్లో ఒక్క పీఏసీఎస్ లేకుండా పోయింది. 272 మండలాల్లో ఒక్కో పీఏసీఎస్ మాత్రమే మిగిలింది. మిగిలిన మండలాల పరిధిలోకి 2 నుంచి 3 పీఏపీఎస్ లు వచ్చాయి. రాష్ట్రంలో మండలాల పునఃవ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలా లతో పాటు ప్రతి మండలం యూనిట్ గా 2 పీఏపీఎస్ లు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు 81 మండలాల్లో 2 చొప్పున 162 పీఏపీఎస్ లు కొత్తవి రాగా 272 మండలాల్లో ఒక్కో పీఏపీఎస్ ను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో కొత్తవి 434 రాగా పాతవి 906 కూడా కలుపుకుంటే మొత్తం 1340 పీఏపీఎస్ లకు తాజాగా ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సారి అయినా వాయిదా లేకుండా సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి.