English | Telugu
సమత కేసులో సంచలన తీర్పు.. దోషులకు ఉరిశిక్ష
Updated : Jan 30, 2020
కొమరంభీం జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేయగానే.. దోషులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తామే కుటుంబానికి ఆధారమని, శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు. అయితే మీరు చేసిన నేరం చాలా ఘోరమైనదని చెబుతూ న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. తీర్పుపై సమత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. డిసెంబర్ 27న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.