English | Telugu
ఎగిరే శ్వేతసౌథం... ఎయిర్ ఫోర్స్ వన్... ఇది మామూలు విమానం కాదు...
Updated : Feb 23, 2020
అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎయిర్‌ఫోర్స్ విమానంలోనే వెళ్తారు. అయితే, ఎగిరే శ్వేతసౌథంగా చెప్పుకునే ఎయిర్‌ఫోర్స్ వన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన విమానం. మాజీ అధ్యక్షులు వినియోగించిన ఎయిర్‌ఫోర్స్ వన్ తో పోలిస్తే, ఇఫ్పుడు ట్రంప్ కోసం వినియోగిస్తున్న బోయింగ్ 747-200బీ విమానం మరింత శక్తివంతమైనది. అంతేకాదు, అతిపెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అత్యంత లాంగ్ రేంజ్ విమానం కూడా ఇదొక్కటే.
గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఉంటుంది. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ రూమ్, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్ స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్ ఫోర్స్ వన్ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం.
ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ వన్‌పై దాడులు జరిగితే మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు ఉంటాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8లక్షల 33వేల పౌండ్లు ఉంటుంది. ఇక, అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధంలో ఉండే, సకల సౌకర్యాలు, భద్రతా వ్యవస్థా ఎయిర్‌ఫోర్స్ వన్ లో ఉంటాయ్. అందుకే, ఎయిర్‌ఫోర్స్ వన్ ను ఎగిరే శ్వేత సౌధంగా పిలుస్తారు.