English | Telugu

ఏపీలో "జగన్ రూల్ ఆఫ్" లా ఏమైనా పెట్టారా.. మండిపడ్డ యనమల 

ఏపీలో అమరావతి రైతులకు, పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి ఐకాస, టీడీపీ, రాజధాని పరిరక్షణ సమితి కలిసి చలో గుంటూరు జైలుకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధంలో ఉంచారు. దీని పై తాజాగా స్పందించిన శాసనమండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు జగన్ సర్కార్ పై మండి పడ్డారు. రాష్ట్రంలో "జగన్ రూల్ ఆఫ్ లా" అని ప్రత్యేకంగా ఏమైనా తెచ్చారా అంటూ అయన ఘాటుగా స్పందించారు. శాంతియుత నిరసనలను కూడా అడ్డుకోవడం గర్హనీయం... ఏపిలో అసలు ‘‘రూల్ ఆఫ్ లా’’ ఉందా..? లేక ‘‘జగన్ రూల్ ఆఫ్ లా’’ అని ఏమైనా ప్రత్యేకంగా తెచ్చారా..? దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపిలో ప్రస్తుతం అమలవుతోంది.. ప్రజల ప్రాధమిక హక్కులను ప్రభుత్వం కాల రాస్తోంది.. అంతేకాకుండా రాజ్యాంగ హక్కులను పూర్తిగా హరించివేశారు. నిరసన తెలిపేందుకు దరఖాస్తు చేసినా అనుమతులు ఇవ్వలేదు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు. ఇటువంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అణిచివేత పాలనను అందరు గర్హించాలి. ప్రజలు తమ ప్రాధమిక హక్కులను కాపాడుకోవాలని’’ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.