English | Telugu

రూ.100 కోట్ల అజ్ఞాత విరాళాలు.. దేశంలో రెండో స్థానంలో వైసీపీ!!

రాజకీయ పార్టీలకు కోట్లల్లో విరాళాలు వస్తుంటాయి. ఎంత విరాళాలు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అని ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తుంటాయి. అయితే, కొన్ని నిబంధలు మాత్రం పార్టీలకు వరంగా మారుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.20 వేల లోపు విరాళాలు ఇచ్చే వారి పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదు. అయితే, దాదాపు అన్ని పార్టీలకు రూ.20 వేల లోపే ఎక్కువ విరాళాలు అందుతున్నాయి. అలా అజ్ఞాత విరాళాలు కోట్లలో ఉంటున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘానికి దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలు విరాళాల విషయంపై‌ నివేదికలు సమర్పించాయి. ప్రాంతీయ పార్టీల ఆదాయ మార్గాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2018-19 సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీలకు కలిపి 885.956 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే, ఇందులో 54.32 శాతం(రూ.481.276 కోట్లు) అజ్ఞాత విరాళాలే ఉన్నాయని తేలింది. అజ్ఞాత విరాళాలు అందుతున్న పార్టీల్లో ఒడిశాలోని బీజేడీ 213 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.100 కోట్లతో వైసీపీ నిలిచింది. ఇక 37.78 కోట్లతో టీడీపీ ఐదో స్థానంలో నిలిచింది.

1. బీజేడీ రూ.213.54 కోట్లు
2. వైసీపీ 100.50 కోట్లు
3. శివసేన 60.73 కోట్లు
4. జేడీఎస్ 39.13 కోట్లు
5. టీడీపీ 37.78 కోట్లు