English | Telugu

ఆలయ అర్చకులపై చెర్నాకోలతో వైసీపీ నేతల దాడి 

ఆలయ నిబంధనలను గుర్తు చేసిన పాపానికి ఆలయంలో పూజలు చేసుకునే అర్చకులను వైసీపీ నాయకులు చావబాదారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు అర్చకులు గాయపడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి ఒక వైపు భక్తుల దర్శనం కొనసాగుతోంది. అయితే రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు టికెట్లు ఇవ్వొద్దని అటెండర్‌ ఈశ్వరయ్యకు అర్చకులు తెలిపారు. ఈ విషయం పై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఈశ్వరయ్యను అర్చకుడు చక్రపాణి పక్కకు తోశారు. దీంతో తనపై అర్చకులు దాడి చేశారంటూ ఈశ్వరయ్య చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఈవో మోహన్‌లకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ప్రతాపరెడ్డి, అతని సోదరుడు రామకృష్ణారెడ్డి, అటెండర్‌ ఈశ్వరయ్య, నాగరాజు, రామకృష్ణ అక్కడికి చేరుకుని అర్చకులు సుధాకర శర్మ, మృగఫణిపై దాడి చేశారు.

అర్చకులను చెర్నాకోల, కర్రలతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా ఏకంగా ఆలయంలోనే దాడి చేశారు. దీంతో సుధాకరశర్మ ముఖంపైన, మృగఫణి శర్మ వీపుపైనా గాయాలయ్యాయి. అర్చకుల ఫిర్యాదు మేరకు చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఆలయ సిబ్బంది ఈశ్వరయ్య, నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా అర్చకుల పై దాడి చేసిన ప్రతాపరెడ్డి అతని అనుచరులు పై తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని భక్తులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేసారు. అర్చకులను చితకబాదిన ప్రతా్‌పరెడ్డిని చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని అర్చక సమాఖ్య ప్రతినిధులు ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు డిమాండ్‌ చేశారు.