English | Telugu
తాడేపల్లిగూడెం వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం...
Updated : Oct 2, 2019
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఒక విద్యార్థిపై మరో విద్యార్థి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థిపై దాడి చేయడమే కాకుండా దాడి ఘటనను వీడియో తీసి బాధిత విద్యార్థిపై పైశాచికంగా వ్యవహరించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గత నెలలో ఇద్దరు విద్యార్థుల మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లుగా సమాచారం.
ఇందులో భాగంగా తణుకు మండలం వడ్లూరుకు చెందిన విద్యార్థి, తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం విద్యార్థికి బాకీ పడ్డట్లు సమాచారం. అయితే బాకీ పడ్డ సొమ్ములో కొంత డబ్బు ఇస్తారని పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది, అయితే మరింత డబ్బు ఇవ్వాలని బాధిత విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు మరో విద్యార్థి. కాలేజ్ ఫీజుకని తెచ్చిన డబ్బును కూడా లాక్కున్నారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఫీజ్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే తనను బాత్ రూమ్ లోకి తీసుకువెళ్ళి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన ఘటనపై బాధిత విద్యార్థి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని సమాచారం. ఈ విషయం వెలుగు లోకి రాకుండా తికమక పెట్టే పరిస్థితి ఉంది.