English | Telugu
చైనా కుట్రలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా సైన్యం
Updated : Jun 26, 2020
ఐతే తాజాగా ఈ వివాదం నేపథ్యంలో అమెరికా కూడా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. భారత్ తో పాటు దక్షిణాసియాకు చైనా ముప్పు పొంచి ఉండటంతో.. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా తన దళాలను తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. నిన్న బ్రస్సెల్ ఫోరం వర్ట్యువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్మనీలోని అమెరికా సాయుధ బలగాలను ఆసియా ప్రాంతానికి తరలిస్తున్నట్లు అయన తెలిపారు. చైనా దుందుడుకు చర్యలు భారత్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్ దేశాలకు ప్రమాదకరంగా మారాయని అయన అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో చైనా సైన్యానికి ధీటైన జవాబు చెప్పడానికి అమెరికా తన బలగాలను మోహరించడంతో పాటు తమ వనరులను కూడా వినియోగిస్తామని ఆయన స్పష్టం చేసారు.
కొద్ది రోజుల క్రితం భారత్, చైనాల మధ్య గల్వాన్ ఘర్షణలపై స్పందించిన పాంపియో చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో చైనా పాటిస్తున్న విధానం సరైనది కాదని అయన తీవ్రంగా విమర్శించారు. హాంకాంగ్ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని అయన మండిపడ్డారు. అంతే కాకుండా దక్షిణ చైనా సముద్రం, జపాన్, మలేషియా దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.