English | Telugu

బండిపై కులం పేరు ఉంటే సీజ్! 

కుల రక్కసికి చెక్ పెట్టేందుకు ఉత్తర్ ప్రదేశ్ రవాణా శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కులం తెలిపే స్టిక్కర్లు ఉంటే ఆ వాహనాలను సీజ్ చేస్తోంది. కొందరు తమ వాహనాలపై తమ కులాన్ని ప్రతిబింబించే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. యూపీలో అయితే వాహనాల నెంబర్ ప్లేట్లు, అద్దాలు, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈ స్టిక్కర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. యాదవ్, జాట్, గుజ్జర్, బ్రాహ్మణ్, పండిట్, క్షత్రియ, లోధి, మౌర్య వంటి సామాజిక వర్గాల స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోతుండటాన్ని మహారాష్ట్రకు చెందిన హర్షల్ ప్రభు అనే టీచర్ గమనించాడు. ఇలా తమ సామాజిక వర్గాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సరికాదని, ఇది సమాజంలో విభజనను తీసుకొస్తుందని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు లెటర్ రాశాడు.

హర్షల్ ప్రభు లేఖపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం యూపీ రవాణా శాఖకు పలు నిబంధనలు రూపొందించి పంపించింది. ఇలాంటి వెహికల్స్ ట్రాక్ చేయడం కోసం ఓ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది. పీఎంఓ సూచనల మేరకు యూపీ రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. స్టిక్కర్ల ద్వారా కులాన్ని ప్రదర్శించే వాహనాలను సీజ్ చేస్తోంది. తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ తనిఖీలో ప్రతి 20 వాహనాల్లో ఒకదానిపై స్టిక్కర్ ఉంటోందని, వెహికల్స్‌పై కులం తెలిపే స్టిక్కర్లు అంటించొద్దని కాన్పూర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి తెలిపారు.