English | Telugu
గుంటూరు లో 10 కరోనా రెడ్ జోన్లు: జిల్లా కలెక్టర్
Updated : Apr 7, 2020
గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయని, జిల్లాలో ఇప్పటివరకు 41 కేసులు నమోదు, కాగా వీటిలో 27 కేసులు గుంటూరులోనే నమోదయ్యాయని చెప్పారు. మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్, ఆనందపేట, బుచ్చయ్యతోట, నల్లచెరువు, సంగడిగుంట, శ్రీనివాసరావుతోట, ఆటోనగర్, ఎల్బీ నగర్, కొరిటపాడు ప్రాంతాలను రెడ్ జోన్లగా గుర్తించాం,రెడ్ జోన్లలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
దిల్లీ వెళ్లివచ్చినవారిని కలిసినవారు, కోవిద్- 19 లక్షణాలున్నవారు పరీక్షలకు ముందుకు రావాలని, ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్కులు మూసివేయాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమానితులు వస్తే నోటిఫై చేయాలని సూచించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు, నిత్యావసర దుకాణాలు, మందుల కోసం మాత్రమే రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గుంటూరు నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నామని, ఇకపై గుంటూరుకు మూడే రహదారులు ఉంటాయని, నిత్యవసరాల కొనుగోళ్ల సమయాన్ని ఉదయం 6 నుంచి 9 వరకు కుదించామని జిల్లా కలెక్టర్ వివరించారు.
అర్బన్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ, రోడ్డు మీద యువకులు వాహనంతో వస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెడ్ జోన్లలో రాకపోకలపై పూర్తిగా నిషేధం విధింపు ఉన్నట్టు ప్రకటించారు.