English | Telugu

మహిళలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా మంత్రులు అసభ్యంగా ప్రవర్తించారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. యాక్టివ్ గా ఉండే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి.. తప్పుడు కేసుల్లో ఇరికించి, బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. శాసనమండలిని కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లును పక్కన పెట్టి.. సీఆర్డీయే, మూడు రాజధానుల బిల్లును పాస్ చేయించుకోవడానికే తహతహలాడారని దుయ్యబట్టారు. ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని గత మండలిలో తీర్మానం చేస్తే.. ఆ తీర్మానం అమలు కాకుండా కార్యదర్శి ద్వారా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై కోర్టులో విచారణ జరిగినప్పుడు.. ఈ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయని ఏజీ ఒప్పుకున్న విషయాన్ని కనకమేడల గుర్తు చేశారు. బిల్లులు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు.. మళ్లీ మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనుకోవడంలో ప్రభుత్వం ఉద్దేశమేంటని కనకమేడల ప్రశ్నించారు.

ప్రభుత్వం అనుకున్నది జరగకపోవడంతో మండలిలో విపక్ష సభ్యులపై దాడికి దిగారని, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లపై బెదిరింపులకు దిగారని కనకమేడల విమర్శించారు. మండలికి సంబంధంలేని 16 మంది మంత్రులు ఎందుకు వెళ్లారని, టీడీపీ సభ్యులపై దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సభలో మహిళలు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా మంత్రులు అసభ్యంగా ప్రవర్తించారని కనకమేడల మండిపడ్డారు.