English | Telugu

సుశాంత్ కి తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ.. పైకి చెప్పలేని ఏదో బాధ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ విష‌యం తెలిసిందే. 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో.. ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతి వెనుక కుట్ర ఉందని, ఎవరో హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరీస్తున్నారేమోనని కొందరు అనుమానపడుతున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ మృతితో ఆయన చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూస్తే సుశాంత్ కి తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ ఉందని, అలాగే పైకి చెప్పలేని బాధ ఏదో అనుభవించాడని అర్థమవుతుంది.

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుశాంత్..‌ జూన్‌ 3న చివరి సారిగా తన తల్లి గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ కవితాత్మక పోస్ట్‌ పెట్టాడు. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు.. చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బ్రతుకుతున్నా' అంటూ సుశాంత్ పోస్ట్ పెట్టాడు. తన తల్లి ఫోటోను కూడా అతడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 2002లో తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకుంటూ సుశాంత్ ప్రేమతో పెట్టిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం అతడి ఆత్మహత్య నేపథ్యంలో వైరల్‌గా మారింది. సుశాంత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి లోను చేస్తోంది.