ఏపీ సీఎం జగన్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిర్గతం చేయటం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని.. ఆయనను సీఎం పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టి వేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రముఖ లాయర్లు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వారు లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న ధర్మాసనం దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది చీఫ్ జస్టిస్ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని.. అయితే ఆ లేఖలోని అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని ధర్మాసనం పేర్కొంది. జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సీఎం జగన్ కు భారీ ఊరట లభించింది
అయితే న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది వేసిన మరో పిటిషన్ మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు ఆరోపణలను చేసి న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని తగ్గించేందుకు, అలాగే విశ్వసనీయతను దెబ్బకొట్టేందుకు కుట్రపూరితంగా జగన్ వ్యవహరించినట్లుగా సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇంకా విచారణ జరగాల్సి ఉంది.