English | Telugu
సోమశిల జలాశయంలో రికార్డు స్థాయికి చేరిన నీటి మట్టం
Updated : Nov 1, 2019
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలు అన్ని నిండిపొయాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నీరు చేరింది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికి పూర్తిగా నిండి పోవడంతో జలకళ సంతరించుకుంది.దీంతో 9 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగునీటి వరప్రదాయినిగా భావించే సోమశిల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని కండలేరు రిజర్వాయర్ కు నీరు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం 77.750 టీఎంసీలు ఉండగా ఇన్ ఫ్లో 29.915 క్యూసెక్ లు, ఔట్ ఫ్లో 36.764 క్యూసెక్ ల నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల గేట్లు ఎత్తివేయడంతో కడప జిల్లాలో పెన్న, పేరూరు తప్పిటవారిపల్లె, గంగపేరూరు తదితర గ్రామాలు నీట మునిగాయి. నీరు దిగువకు వదలడంతో ముంపు గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.వందల ఎకరాల్లో పంట నీట మునిగినట్టుగా అధికారులు గుర్తించారు. సోమశిల ప్రాజెక్టు నిండి పోవడంతో జిల్లాలో రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రాజెక్టు చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిస్తున్నారు.మొత్తం ఈ డ్యాం కెపాసిటీ 78 టీఎంసీలతో తొలిసారిగా నిండి చరిత్రలో ఇప్పటి వరకు కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయం అంటే మొత్తం 78 కెపాసిటీల నీటి సామర్థ్యం అనేది తొలిసారిగా వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో సోమశిల నుంచి అధికారులు గేట్లన్నీ కూడా ఎత్తి వేశారు.ఇక్కడి నుండి పెన్నా డెల్టాకు కూడా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.