English | Telugu
లాక్ డౌన్ తో భారీగా పడిపోయిన ఉప్పు ఉత్పత్తి! ఉప్పుధర పెరగనుందా?
Updated : May 8, 2020
భారతీయులు ప్రతి సంవత్సరం 95 లక్షల టన్నుల ఉప్పు తింటారు. పరిశ్రమల కోసం ఉపయోగించే ఉప్పు డిమాండ్ 110 - 130 లక్షల టన్నుల మధ్య ఉంటుంది. అయితే ఈ ఉప్పు ఉత్పత్తి చక్రం 60 నుండి 80 రోజులు వుంటుంది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో అవపాతం స్థాయిలను బట్టి అది ఉత్పత్తి అవుతుంది.
మార్చి నెలలో సగం రోజులు మరియు ఏప్రిల్ నెల రోజుల కాలం మొత్తాన్నిఉప్పు ఉత్పత్తి జరగలేదు. ఉప్పు ఉత్పత్తికి అది సరైన సీజన్. అయితే సీజన్ గరిష్టంగా ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. ఉప్పు ఉత్పత్తిలో నాలుగు నెలల ఉత్పత్తిని కోల్పోయినట్టే అని ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఇస్మా) అధ్యక్షుడు భరత్ రావల్ ఆందోళన వ్యక్తం చేశారు.
అక్టోబర్ మరియు జూన్ మధ్య కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు ఉత్పత్తి ఉంటుంది .మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఎండాకాలం కాబట్టి ఉప్పు మడులు కట్టి మరీ గరిష్ట ఉత్పత్తి చేస్తారు. గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఉత్పత్తిలో దాదాపు 95 శాతం ఉండగా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ చిన్న పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నాయి . ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో 200 - 250 లక్షల టన్నుల ఉప్పు తయారీ జరుగుతుంది .
పారిశ్రామిక ఉప్పును విద్యుత్ ప్లాంట్లు, చమురు శుద్ధి కర్మాగారాలు, సౌర విద్యుత్ సంస్థలు, రసాయన తయారీదారులు, వస్త్ర తయారీదారులు, లోహపు కర్మాగారాలు, ఔషధాలు, రబ్బరు మరియు తోలు తయారీదారులు ఉపయోగిస్తున్నారు. ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకటన మేరకు ఉప్పు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి.