మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. అసలే కరోనా కష్టకాలంలో సంపాదన తగ్గి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే, విద్యుత్ బిల్లులు షాకిస్తూ మరింత కష్టపెడుతున్నాయి. ఎప్పుడూ రానంతగా విద్యుత్ బిల్లులు చాలా ఎక్కువ మొత్తంలో వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరెంట్ బిల్లింగ్ లో ఎక్కడ పొరపాటు లేదని స్పష్టం చేసింది. మామూలుగానే వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని, దానికితోడు లాక్ డౌన్ తో అందరూ ఇళ్లలో ఉండటంతో మరింత వినియోగం పెరిగిందని చెప్పుకొచ్చింది. అదీగాక, మూడు నెలల బిల్లు ఒకేసారి రావడంతో కూడా పెద్ద మొత్తంలాగా కనిపిస్తుందని తెలిపింది. ఇదిలాఉంటే, విద్యుత్ బిల్లుల చెల్లింపుపై తెలంగాణ సర్కార్ వినియోగదారులకు ఊరట కల్పించింది. మూడు నెలల బిల్లును వాయిదా పద్ధతిలో కట్టే అవకాశం ఇస్తున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు
మార్చి, ఏప్రిల్, మే మాసాలకు జారీచేసిన బిల్లు మొత్తాన్ని 30శాతం, 40శాతం, 30శాతం చొప్పున మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. తదుపరి మాసాల్లో జారీ అయ్యే బిల్లులతో పాటు వాయిదా మొత్తాన్ని కలిపి చెల్లించాలని, ఇందుకు 1.5 శాతం చొప్పున వడ్డీగా చెల్లించాలని చెప్పారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఆదాయం పడిపోయి, బిల్లులు చెల్లించలేని వారికోసమే ఈ అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపులకు వాయిదాల వెసులుబాటు వర్తించదని, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ అవకాశముంటుందని పేర్కొన్నారు.