English | Telugu

సోనియా దెబ్బకు కాంగ్రెస్ పతనం.. మోడీ ఒక నియంత.. ఆత్మకథలో ప్రణబ్ కామెంట్స్ 

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ రాసిన తన ఆత్మకథ లో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని మోడీలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి. తాను భారత దేశ రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ దృష్టికోణం నుంచి పక్కకు జరిగిందని, అదే సమయంలో సోనియాగాంధీ పార్టీ వ్యవహారాలను సరిగా నిర్వర్తించలేకపోయారని ప్రణబ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో పార్టీ నాయకత్వ మార్పు పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు వెలుగు చూడడం పలువురిలో ఆసక్తిని రేపుతోంది. 84 ఏళ్ల వయసులో ప్రణబ్ గత జులై 31న కరోనాతో కన్నుమూశారు. అయితే దానికి ముందే అయన తన ఆత్మకథను పూర్తి చేసారు.

అప్పటి ప్రధాని మన్మోహన్ ‌సింగ్‌కు, ఎంపీలకు మధ్య వ్యక్తిగత సంప్రదింపులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పతనమైందని ప్రణబ్ తన ఆత్మకథ లో పేర్కొన్నారు. "ద ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్" అనే పేరుతో అయన రాసిన ఆత్మకథ వచ్చే నెలలో రూప పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితం కానుంది. ఈ నేపథ్యంలో ఇందులోని కొన్ని వ్యాఖ్యలను రూప పబ్లికేషన్స్ బహిర్గతం చేసింది.

2004లో తాను కనుక ప్రధాని అయి ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర ఓటమి నుంచి బయటపడేదని చాలామంది పార్టీ నాయకులు తనతో చెప్పారని.. అయితే వారి అభిప్రాయాన్ని తాను అంగీకరించలేదని తన ఆత్మకథలో పేర్కొన్నారు. అయితే, తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత పార్టీ హైకమాండ్ రాజకీయ దృష్ణి కోణం కోల్పోయిందని, అంతేకాకుండా పార్టీని నడిపించడంలో సోనియా విఫలమయ్యారని పేర్కొన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వంలోని కూటమిని రక్షించుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని అయన అన్నారు.

మరో పక్క బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపైనా ప్రణబ్ విమర్శలు చేశారు. మోదీ తన తొలి ఐదేళ్ల పాలనలో నియంతృత్వాన్ని అనుసరించినట్టే కనిపిస్తోందన్నారు. మోడీ మొదటి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య చేదు సంబంధాలు నెలకొన్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. ఇక మోడీ రెండోసారి అధికారంలోకి రావడంతో ఈసారి అది మరింత స్పష్టంగా అర్థమవుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని ప్రణబ్ పేర్కొన్నారు.

ఇక అమెరికా అధ్యక్షుడు ఒబామా 2015లో భారత పర్యటన సందర్భంగా అయన కారులో కూర్చోమన్నారని.. అయితే దీనిని గౌరవంగానే గట్టిగా తిరస్కరించినట్లు ప్రణబ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు భారత రాష్ట్రపతితో కలిసి ప్రయాణించేటప్పుడు భారత భద్రతా వ్యవస్థల ఏర్పాట్లపై విశ్వాసం ఉంచాలని అమెరికా అధికారులకు తెలియచేయండని విదేశాంగ శాఖకు చెప్పానని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.