English | Telugu
తెలంగాణలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారా ?
Updated : Oct 3, 2019
ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు వారానికొక సెలవు ఇస్తామనీ వత్తిడి తగ్గించటానికి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. మరోవైపు అధికార పక్ష నేతలు అదే పోలీసు యంత్రాంగాన్ని తమ ఇష్టానుసారం వాడుకుంటూ వత్తిడికి గురి చేస్తున్నారు. రాజకీయ ప్రమేయాలతో పాటు శాఖా పరమైన ఒత్తిళ్లతో అనేక మంది పోలీసులు బిపి, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంకొందరు పనివత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది.
అరవ చాకిరి అంటారే అచ్చం అలాగే ఉంది ప్రస్తుతం పోలీసుల విధి నిర్వహణ, ఇపుడున్న పరిస్థితుల్లో ఏ పోలీసు ఉద్యోగి కూడా స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు. హోంగార్డు మొదలు, డీఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. పైగా సమయ పాలన కూడా ఉండడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మంది పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల పైరవేళుతోనే పోస్టింగ్లు పొందుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇతర ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు ఎవరి పేరు చెబితే వారికి ఇక్కడ పోస్టింగ్ లభిస్తోంది. ఈ సందర్భంగా మధ్యవర్తులుగా ఉండే నాయకులూ, పైరవీకార్లు లక్షలాది రూపాయలు మింగేస్తున్నారు. మంచి ఆదాయం లభించే పోలీస్ స్టేషన్ లలో పోస్టింగ్ కావాలంటే ఐదు లక్షల వరకు చెల్లించుకోవాలి, రవాణా సౌకర్యాలు ఉండి హైదరాబాద్ కి రాకపోకలకు అనువుగా ఉండే స్టేషన్ లైతే మూడు లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని నాలుగు స్టేషన్ లు, బోధన్ నియోజకవర్గంలో మూడు, ఆర్మూర్ బాల్కొండ ప్రాంతాల్లో రెండేసి పోలీసు స్టేషన్ లకు బాగా డిమాండ్ ఉంది. అలాగే కామారెడ్డి పట్టణం, కామారెడ్డి రూరల్ తో పాటు బాన్స్ వాడలో మూడు ఠాణాలో పోస్టింగ్ లకు అధికారులు పోటీపడుతుంటారు. హైదరాబాద్ లో ఉండే కొందరు అధికారులు జాతీయ రహదారి పై ఉండే స్టేషన్ లను కోరుకుంటున్నారు. ఆయా చోట్ల పోస్టింగ్ లు ఆశించేవారు పోటీ పడి మరీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లా లోని నాలుగు నియోజక వర్గాల్లో ప్రధాన పోస్టింగులన్నీ రాజకీయ నాయకుల చేతుల్లోనే వున్నాయి. అక్కడెవరూ పనిచేయాలో, ఎవరు చెయ్యొద్దు అని నిర్ణయించేది కూడా వారే.
ఈనేపధ్యంలో నాయకుల పైరవీ ద్వారా పోస్టింగులు పొందిన ఎస్సైలు, సీఐలు నిబంధనలు అతిక్రమించి మరీ వారికి తమ సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే ఎమ్మెల్యేలకు ఎస్ క్వార్ట్ ఇచ్చే అవకాశం లేదు. ప్రత్యేకంగా కోరితే తప్ప పోలీస్ భద్రత కూడా కల్పించాల్సిన అవసరం లేదు. కానీ కొందరు ఎస్సైలు, సీఐలు ఎమ్మెల్యే తమ పరిధిలోకి వచ్చిన మొదలు తిరిగి వెళ్లే వరకు ఎస్కార్టుగా ఉంటున్నారు. సదరు నేత కంట్లో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. తమ సిబ్బందిని వెంటేసుకుని మరి సైరన్ మోతలతో ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద ఇరవై నాలుగు గంటల పాటు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే గానీ, ఎంపీగానీ, ఇతర ముఖ్య నేతలు గానీ ఏదైనా ప్రాంతానికి వెళ్ళారంటే అక్కడి పోలీసు యంత్రాంగమంతా వారి చుట్టూనే ప్రదక్షిణలు చేస్తోంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణ పౌరులకు ఏదైనా అవసరం పడితే పోలీసులు అందుబాటులో ఉండటం లేదు. కేసుల విచారణ, ఫిర్యాదుల స్వీకరణ వంటివి వారు ఎప్పుడో మర్చిపోయారు. గతంలో మంచి పని తీరు, ఇన్వెస్టిగేషన్, సిన్సియారిటీ వంటి ప్రమాణాలతో ఉన్నతాధికారుల మెప్పు పొంది పోస్టింగ్లు లేదా ప్రమోషన్లు పొందేవారు. కానీ ఇప్పుడు ఉన్నతాధికారులను ఓవర్ టేక్ చేసి నాయకుల మెప్పు పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. పైరవీలతో ఉద్యోగం చేయడం ఇష్టం లేని అనేక మంది చురుకైన అధికారులూ లూప్ లైన్ లోకి వెళ్ళిపోయారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 4,500 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. కామరెడ్డి జిల్లాలో 3000 పై చిలుకు ఉద్యోగులున్నారు. ఇప్పుడున్న జనాభా వస్తున్న కేసుల ప్రాతిపదికన చూస్తే అవసరమైన సిబ్బందిలో ఇప్పుడు 50 శాతం కూడా లేరని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ స్టేషన్లలో నలుగురు హెడ్ కానిస్టేబుళ్లుగా ఇద్దరే ఉంటున్నారు. 18 నుంచి 20 మంది కానిస్టేబుళ్లు అవసరమైతే 10 మందితోనే నడుపుతున్నారు. దీంతో నాయకుల ప్రమేయాలు ఒకవైపు, పనిభారం మరోవైపు పోలీసులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి.గతంతో పోలిస్తే ఇప్పటి పోలీసులకు శారీరక శ్రమ చాలా తగ్గింది. మానసిక ఒత్తిడి మాత్రం అనేక రెట్లు పెరిగింది. ఆందోళన ఎక్కువైంది. దీంతో ఎక్కువ మంది తక్కువ వయసులోనే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. సమయానికి నిద్ర, భోజనం వుండడంలేదు. కామరెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక చాలా మంది పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరి కొందరు పిల్లల చదువుల కోసం కుటుంబాలను హైదరాబాద్ లో పెట్టి ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలని పనిభారం తగ్గించాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసు పక్షపాతిగా చెప్పుకునే సీఎం కేసీఆర్ ఇప్పటికైనా పోలీసులకు రాజకీయ బంధాల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు. దీనిమీద అధికార పెద్దల ఎలా స్పందిస్తారు చూద్దాం.