English | Telugu

అచ్చెన్న పరామర్శకు వచ్చిన బాబు.. అనుమతించని అధికారులు

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాలతో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోగా జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం బాబుకు అనుమతి ఇవ్వలేమని జైళ్ల శాఖ తేల్చిచెప్పింది. ఐతే చంద్రబాబు చేసిన మరో విజ్ఞప్తి పై జిజిహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. మేజిస్ట్రేట్ నుండి అనుమతి తీసుకోవాలని సూపరింటెండెంట్ బాబుకు సూచించారు. ఇదే సందర్బంలో అచ్చెన్న తాజా ఆరోగ్య పరిస్థితి గురించి అయన అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అభివృద్ధి కోసం అచ్చెన్న కుటుంబం కృషి చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వ పాలన నవరత్నాలు.. నవ మోసాలుగా ఉన్నాయని పోరాడుతుంటే అచ్చెన్నాయుడి పై లేని పోని కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారన్నారు. అచ్చెన్నను ఇరికించడం కోసం తప్పుడు రికార్డులను సృష్టించారని.. ప్రతిష్ట కలిగిన అయన కుటుంబంపై వైసిపి నాయకులు బురద జల్లుతున్నారన్నారు. పలువురు టీడీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకుంటున్నారని అయన విమర్శించారు. వాస్తవాలు ప్రజల ముందు పెడతాం.. దోషులు ఎవరో త్వరలో తెలుస్తుంది. వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దేశంలో ఉన్న చట్టాన్ని ఏపీలో అమలు చేయడంలేదని బాబు మండిపడ్డారు.