English | Telugu
ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు... ఘటన వెనక మరో ఎమ్మెల్యే హస్తం!!
Updated : Oct 5, 2019
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లేఅవుట్‌కు అనుమతి ఇవ్వలేదన్న కారణంతో కోటంరెడ్డి దౌర్జన్యం చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరిపల్లిలో ఉన్న తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని, వాటర్, కేబుల్ కనెక్షన్ తొలగించి బెదిరించారని కోటంరెడ్డిపై సరళ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. కొద్ది రోజల కిందట.. జమీన్ రైతు అనే పత్రిక ఎడిటర్ ఇంటిపై దాడి చేశారు. అంతకు ముందు.. మరో జర్నలిస్టును.. అడ్డంగా నరికేస్తా.. దిక్కున్నచోట చెప్పుకో అని హెచ్చరిస్తున్న ఆడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు అనుమతి ఇవ్వడం ఆలస్యం అయిందన్న కారణంగా.. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని కోటంరెడ్డిపై సరళ ఫిర్యాదు చేశారు.
కాగా ఈ ఘటనపై కోటంరెడ్డి స్పందించారు. ఇంటికెళ్లి దౌర్జన్యం చేసామన్న ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు. ‘ నెల్లూరు జిల్లాలో ‘నుడా’, ‘రేరా’.. రెండు సంస్థల అనుమతులు ఉన్న ఏకైక లే-అవుట్ అది ఒక్కటే. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. దానికి అధికారిక అనుమతులు ఇచ్చి కూడా చాలా కాలం అయింది. మూడు నెలలుగా వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నేను ఎంపీడీవో సరళ గారికి ఫోన్ చేసిన మాట వాస్తవమే’ అని అన్నారు. వాటర్ కనెక్షన్ ఇవ్వొచ్చుగా అని తాను అడిగితే, ‘మా ఎమ్మెల్యేగారు ఇవ్వొద్దంటున్నారు సార్’ అని ఆమె బదులివ్వడంతో.. ‘మీ ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశానని అన్నారు.
‘వాళ్ల ఎమ్మెల్యేకు కూడా ఫోన్ చేశాను. వాళ్ల ఎమ్మెల్యే అంటే కాకాణి గోవర్థన్ రెడ్డి. ఎవరో కాదు స్వయానా నాకు బావే.’ అని తెలిపారు. ‘మన జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల సొంత లే-అవుట్, అన్ని అనుమతులు ఉన్న లే-అవుట్. 3 నెలల నుంచి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఎంపీడీవో ఇబ్బంది పెడుతోంది. అదేమంటే, ‘నీ మీద చెబుతోంది’’ అని చెప్పాను. ‘దాంట్లో వేరే ఉందిలే, నీతో మెల్లిగా మాట్లాడతానులే’ అని అన్నాడు. అంత వరకే జరిగింది’ అని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
ఎంపీడీవో ఇంటికి కరెంట్, నీటి సరఫరా లేకుండా కట్ చేశారన్న ఆరోపణలపై కోటంరెడ్డి స్పందిస్తూ.. కరెంట్, నీటి సరఫరాను ఎమ్మెల్యే కట్ చేస్తారా? ఎవరైనా ఆ పనులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీడీవో ఇంటికి తాను వెళ్లి దౌర్జన్యం చేసినట్టు వస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చ పెడదామని అందుకు సిద్ధమేనా? అని కోటంరెడ్డి సవాల్ చేసారు.