English | Telugu

మ్యుటేట్ అయిన కరోనా వైరస్.. ఇది వ్యాపిస్తే వాక్సిన్లు ఎందుకు పనికిరావు 

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నో రూపాంతరాలు (మ్యుటేషన్) చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అది మరింత ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్‌లో తాజాగా సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయని, ఈ మార్పు చెందిన తర్వాత వైరస్ కనుక విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వాక్సిన్లు కూడా ఎందుకూ పనికి రాకుండా పోతాయని వారు హెచ్చరిస్తున్నారు.

డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుండి ఈ రూపాంతరం చెందిన వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్టు స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా శాస్త్రవేత్తల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం వందల కొద్దీ మింక్ జంతువుల ఫారాలు ఉన్న జూట్‌ల్యాండ్‌లో కఠిన ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఉత్తర డెన్మార్క్‌లో ఈరోజు నుండి కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టి ఫ్రెడ్రెక్సన్ తెలిపారు. ఆ ప్రాంతంలో నివసించేవారు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని, దీనిని ఉల్లంఘిస్తే కనుక వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.