English | Telugu

బైడెన్ గెలుపును మేము గుర్తించడంలేదు.. రష్యా అధ్యక్షుడు పుతిన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ తుది ఫలితాట్లు వచ్చేసరికి జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించిన సంగతి తెల్సిందే. దీంతో పలు ప్రపంచదేశాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినా, చైనా, రష్యా వంటి కొన్నిదేశాలు మాత్రం కొంత వేచిచూసే ధోరణి అవలంబించాయి. అయితే చైనా ఇటీవలే బైడెన్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించగా, రష్యా మాత్రం నిన్నటివరకు స్పందించలేదు.

అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ అంశం పై స్పందించారు. అగ్రరాజ్య అధినేతగా జో బైడెన్‌ను గుర్తించడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేసారు. బైడెన్ గెలిచాడన్న విషయాన్ని ఇంకా అమెరికాలోనే చట్టబద్ధంగా ప్రకటించాల్సి ఉందని, అంతేకాకుండా బైడెన్ విజేత అని ఆయన ప్రత్యర్థి పక్షం కూడా గుర్తించాల్సి ఉందని పుతిన్ అభిప్రాయపడ్డారు.అంతేకానీ బైడెన్ ను అభినందించకపోవడం వెనుక ఎలాంటి వ్యూహాత్మక విధానం లేదని అయన అన్నారు.

అమెరికా ప్రజల నమ్మకం కలిగిన ఏ నాయకుడితోనైనా కలిసి పని చేయడానికి మేము సిద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రష్యా అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను మీ నిర్ణయం దెబ్బతీస్తుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడో క్షీణించాయి.. కొత్తగా దెబ్బతినడానికి ఏమీ మిగిలి లేదంటూ పుతిన్ బదులిచ్చారు. ఇదిలా ఉండగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపుకు రష్యా తన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రహస్యంగా కృషి చేసిందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.