English | Telugu

మంత్రి హరీష్ రావుకు థాంక్స్... దుబ్బాక ఓటమిపై కేటీఆర్ రియాక్షన్ 

దుబ్బాక ఉపఎన్నికలో తన సొంత స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడంలో టీఆరెఎస్ బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నీ తానే అయి ప్రచారం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరో పక్క బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా టార్గెట్ చేసినా చివరికి విజయం బీజేపీనే వరించింది. దీంతో తెలంగాణ వచ్చిన తరువాత ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ ఓడిపోయినట్టు అయ్యింది

తాజాగా దుబ్బాక ఓటమి పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఉప ఎన్నికల్లో ఫలితం తాము ఊహించిన విధంగా రాలేదని అన్నారు. తెలంగాణ వచ్చిన ఆరున్నరేళ్లలో తాము అనేక విజయాలు సాధించామని.. అయితే ఈ తాజా ఫలితం ఒక రకంగా తాము అప్రమత్తంగా కావడానికి ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఫలితంపై పార్టీలో లోతుగా సమీక్షించుకుంటామని అయన అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎలాంటి తొట్రుపాటు ఉండకుండా ముందుకు వెళతామని కేటీఆర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచనల మేరకు ముందుకు సాగుతామని అయన అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ కు ఓటు వేసిన 62 వేల మందికి అయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు, మరీ ముఖ్యంగా మంత్రి హరీశ్ రావుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.