English | Telugu

బతుకమ్మ పండగను విశ్వ వ్యాప్తం చేసిన వారికి అభినందనలు తెలిపిన కె.టి.ఆర్...

దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి అమోఘమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సాంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా మార్చిన ఘనత జాగృతిదే అన్నారు. బతుకమ్మ పండగను విశ్వ వ్యాప్తం చేసిన సోదరి కవితకు జాగృతిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు.

దేశ విదేశాల్లో ఈ రోజు బతుకమ్మ ప్రాచుర్యం పొందిందంటే, దేశ విదేశాల్లో ఈ రోజు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు అంటే తెలంగాణ ఆడబిడ్డలు సంబరంగా ఈ బతుకమ్మలో పాల్గొంటున్నారు అంటే దానికి విశేషమైన ఖ్యాతి, విశేషమైన కీర్తి తెలంగాణ జాగృతి సంస్థకు దక్కుతుందని కె.టి.ఆర్ అన్నారు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన మహిళలందరూ జరుపుకునే బతుకమ్మని నిషేధిస్తే తెలంగాణ జాగృతి హైకోర్టుకు వెళ్లి ఆనాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పాత్ర పోషించిందన్నారు.

బతుకమ్మ పండుగ ఈ రోజు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ లోని మహిళామణులందరికీ సంతోషాన్ని ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఒక వైపు సిరిసిల్ల నేతన్నలకు ఉపాధిని ఇస్తూ, బతుకమ్మ చీరలు అందివ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులందరూ సగర్వంగా, సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనీ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కె.టి.ఆర్ అభినందనలు తెలిపారు.