English | Telugu

ఆ పరిస్థితి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

ఏపీ వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించాలని పేర్కొంది.

అయితే, ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సున్నావడ్డీలానే ఉచిత విద్యుత్‌ ను నీరుగార్చబోతున్నారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ఉచిత విద్యుత్ విధానాన్ని మార్చడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు నష్టం వస్తుందన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ పై మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు విద్యుత్‌ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.