English | Telugu
150 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. మొబైల్ నిండా అశ్లీల వీడియోలే!
Updated : Feb 13, 2020
సైబర్ నిందితుడు కందగట్ల భాస్కర్ అరెస్ట్ లో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. రుణాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని మొబైల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల వీడియోలను చూసి ఖంగుతిన్నారు ఖాకీలు. కామాంధుడైన కందగట్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కందగట్ల భాస్కర్ అరెస్టులో సరికొత్త ట్విస్ట్ ఎదురైంది. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపిస్తూ సుమారు నూట యాభై మందికి పైగా మహిళలను భాస్కర్ వేధించినట్లు తేలింది. భాస్కర్ సెల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలను టార్గెట్ చేసి అశ్లీల వీడియోలు, న్యూడ్ వీడియో కాల్స్ తో వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
జనగామ జిల్లా నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ గతంలో ఆరోగ్య శ్రీ విభాగంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేశారు. ప్రస్తుతం సొంతూరిలో వ్యవసాయం చేస్తున్నాడు, తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ అండ్ మోనిటరింగ్ సిస్టం పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించేవాడు. అలా మహిళల వివరాలను సేకరించి దుర్వినియోగం చేశాడు భాస్కర్. ఎన్జీవోలో పనిచేస్తున్నానంటూ కలరింగ్ ఇచ్చి, రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికే వాడు. మహిళలతో పరిచయం పెంచుకొని అశ్లీల వీడియోలు పంపేవాడు, సిమ్ కార్డులు మారుస్తూ వాట్సాప్ లో న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు 150 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. భాస్కర్ వేధింపుల బారిన పడిన వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ పై 2007లో లింగాల ఘణపురం లోనే ఇలాంటి కేసు నమోదవడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయినా భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు, ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న అతడిని మరోసారి విచారణ జరుపుతున్నారు పోలీసులు.