English | Telugu

అధికారులు తాగి పడుకోవద్దు! మంత్రి ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు 

వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారులు తాగిపడుకోకుండా సీరియస్ గా పనిచేయాలని మంత్రి అన్నారు. మేడారం జాతరలో తాగిపడుకున్నట్టు ఇక్కడ పడుకుంటే కుదరదన్నారు. మేడారం జాతర సందర్భంగా పలువురు అధికారులతో మాట్లాడుతుంటే తాగిఊగుతున్నారని గుర్తుచేశారు. ఐనవోలు జాతరలో అలా చేయకుండా సీరియస్ గా పనిచేయాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర జ‌న‌వ‌రి 13,14,15 తేదీల్లో మూడు రోజుల‌పాటు జ‌రగనుంది. జాతర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి.. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు ఏర్పాటు చేయాలని ఆదేశింతారు. క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌న పై ఆయాశాఖ‌ల అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. కోటి రూపాయలతో ఐనవోలు లో శాశ్వత ప్రాతిపదికన బాత్ రూం ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ని మంత్రి అభినందించారు. జాతరలో సోడియం హైపోరైడ్ ద్రావణం పిచ్చికారీ, నిరంతర శానిటేషన్ కి అంగీకరించిన మేయర్ గుండా ప్రకాశ్ రావుని కూడా మంత్రి అభినందించారు. కోవిడ్ నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కలు ఉంటేనే దర్శనం కలిగించాలని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.