English | Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి సీఎస్ గా ఆయనకే ఛాన్స్..!
Updated : Dec 9, 2020
అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక భిన్నమైన ఒరవడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌ను ముందుగా సీఎస్ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు సమాచారం. దీంతో నెలాఖరు వరకూ అయన ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సంప్రదాయం కేంద్ర సర్వీసుల్లో ఇప్పటికే ఉంది. అదే తరహాలో ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ నియామకం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ వరుసగా ఉన్నారు. అయితే వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు.
ఇక మరో ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. అప్పట్లో అయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబివి తో కలిసి వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి కారణమయ్యారని భావిస్తున్న సీఎం ఆయనను సీఎస్ గా చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఇక మరో అధికారి జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు సదభిప్రాయం లేదని తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఉన్న నీరబ్ కుమార్ సీఎస్ అవుతారని, అందుకే ఆయనను సీసీఎల్‌ఏగా నియమించారని కొంతకాలంగా ప్రచారం జరిగినా.. నీరబ్‌కు 2024 జూన్ వరకూ పదవీకాలం ఉంది. దీంతో ఆయనను నియమిస్తే మధ్యలో కొంతమందికి సీఎస్ అయ్యే అవకాశం మిస్ అవుతుంది. అంతేకాకుండా అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అయితే ఆదిత్యనాథ్ దాస్ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.