English | Telugu

ఇది భారత్ కి చైనాకి తేడా.. మనవాళ్ళు కాపాడారు.. వాళ్ళు కిడ్నాప్ చేశారు

భారత బలగాలు, చైనా బలగాలు మధ్య వ్యత్యాసం ఏంటో తాజాగా జరిగిన రెండు సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఒకవైపు చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులను భారత బలగాలు రక్షించగా.. మరోవైపు ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి.

ఉత్తర సిక్కిం ప్రాంతంలో సముద్ర మట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తైన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దారి తప్పి భారత భూభాగంలోకి ప్రవేశించారు. అయితే భార‌త్- చైనాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు ఉన్న వేళ కూడా భారత సైనికులు వారిని రక్షించి మానవత్వాన్ని, మన దేశ గొప్పతనాన్ని చాటారు. భార‌త సైనికులు మొదట వారిని అడ్డుకుని ప్ర‌శ్నించి.. పొర‌పాటున దారి తప్పార‌ని నిర్ధారించుకున్న అనంత‌రం వారికి ఆక్సిజన్ తో పాటు మెడిక‌ల్ సాయం అంద‌చేశారు. అలాగే వారికి ఆహారం ఇచ్చారు. చలిని త‌ట్టుకునేందుకు వీలుగా వారికి వెచ్చ‌టి దుస్తులను కూడా ఇచ్చి.. వారు చైనా వెళ్లేందుకు మార్గం చూపి సాగ‌నంపారు.

ఐతే ఒకవైపు చైనా వ్యక్తులను భారత సైనికులు రక్షిస్తే.. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి చెందిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించడం గమనార్హం. భారత్- చైనా సరిహద్దుల్లో ఉన్న ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని అడవుల్లో శుక్రవారంనాడు వేటకు వెళ్లిన ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి. వేటకు వెళ్లిన గ్రూపులోని ఇద్దరు ఎలాగో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై వాస్తవాలను నిర్ధారణ చేసుకుని, తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా నాచో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఆఫీసర్‌ ను ఆదేశించినట్టు పోలీస్ సూపరింటెండెంట్ తరు గుస్సార్ తెలిపారు.