English | Telugu
ప్రపంచాన్ని గడగడలాడించాడు... కానీ కుక్కచావు చచ్చాడు...
Updated : Oct 28, 2019
వేలాది మందిని ఊచకోత కోసి నరమేధం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్స్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న ఐసిస్ అధినేత బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైన్యం నుంచి తప్పించుకోలేక ఆత్మాహుతికి పాల్పడ్డాడని తెలిపారు. చివరి క్షణాల్లో బాగ్దాదీ భయంతో వణకిపోయాడని, పిరికివాడిలా పారిపోయి, తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్ ప్రకటించారు.
బాగ్దాదీ టార్గెట్ గా ఈశాన్య సిరియాలో అమెరికన్ ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. అయితే, అమెరికా సైన్యం రాకతో బాగ్దాదీ భయంతో పారిపోయి, సొరంగం చివరన దాక్కున్నాడు. కానీ, అమెరికా ఆర్మీ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిర్ధారించుకున్నాక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. బాంబులతో తనను పేల్చేసుకోవడంతో బాగ్దాదీ శరీరం తునాతునకైందని ట్రంప్ వెల్లడించారు. అయితే, డీఎన్ఏ టెస్టుల ద్వారా బాగ్దాదీ మృతిని ధృవీకరించాయని ట్రంప్ స్పష్టంచేశారు.
రెండు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ మొత్తాన్ని తాను తిలకించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బాగ్దాదీ మృతి తర్వాత వైట్ హౌస్ నుంచి అమెరికన్లనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.... ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న ఐసిస్ అధినేత కుక్క చావు చచ్చాడని ప్రకటించారు. అమెరికా సైన్యానికి భయపడి బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అయితే, బాగ్దాదీని అంతమొందించాలన్న తమ లక్ష్యం పూర్తికావడంతో ఈశాన్య సిరియా నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.