English | Telugu

అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించారాంటూ అయ్యన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ కక్షతో తనపై అక్రమంగా కేసు బనాయించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయ్యన్న దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.