English | Telugu

రోజా, మధుసూదన్ రెడ్డి రోడ్ల మీద పడి ఉరేగింపులు చేసినా కేసులు లేవు

వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తోందని టీడీపీ నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ మీద విడుదలైన జేసి ప్రభాకర్ రెడ్డిని పోలీసులతో వాగ్వివాదానికి దిగారని మళ్లీ రిమాండ్‌కు తరలించడం దారుణమని అన్నారు.

ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా, మధుసూదన్ రెడ్డి రోడ్ల మీద పడి ఉరేగింపులు చేసినా కేసులు లేవని మండిపడ్డారు. ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తూ.. తప్పు చేయక పోయినా కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

గుంటూరులో ఒక మైనార్టీ వ్యక్తి మీద సీఐ దుర్భాషలాడిన ఘటనపై ఎటువంటి చర్యలు లేవని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక తరలింపును అడ్డుకున్న యువకుడికి పోలీసులే శిరోముండనం చేయిస్తే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.