English | Telugu
ఈటల రాజేందర్ మళ్లీ హర్టయ్యారు!.. ఈ సారి బీజేపీతో తాడో పేడో?
Updated : Dec 13, 2025
ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా... ఆ పార్టీలో ఆయన ఒంటరే అని చెప్పాలి. అసలు ఈటల బీజేపీలో చేరడమే ఆశ్చర్యమంటారు ఆయన గురించి తెలిసిన వారు. సరే రాజకీయ అనివార్యతతో ఆయన బీజేపీ పంచన చేరినా పదే పదే అవమానాలకు గురైతున్నారు. ఉక్కపోతను తట్టుకుంటూ నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ సాధన ఉద్యమం నుంచి, రాష్ట్ర ఆవిర్భావం వరకూ, ఆ తరువాత ఐదేళ్ల పాటు మంత్రిగా ఈటల తెలంగాణ ప్రగతిలో కేసీఆర్ తో సమానమైన స్థాయిలో పని చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఈ విషయం వాస్తవం. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత తెలంగాణ ప్రగతిలో, సంక్షేమంలో ఈటల ముద్ర చెరిపివేయడం సాధ్యం కాదనీ బీఆర్ఎస్ వర్గాలే చెబుతాయి.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటల బడ్జెట్ కేటాయింపులు హేతుబద్ధంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేవని బీఆర్ఎస్ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా అప్పట్లో ప్రశంసలు కురిపించారు. వామపక్ష భావజాలంతో ఉ:డే ఈటల.. తన శాఖకు సంబంధించినంత వరకూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారనీ, అదే కేసీఆర్ కు నచ్చలేదనీ అనే వారు బీఆర్ఎస్ లో ఇప్పటికీ ఉన్నారు. సరే 2014 ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపిన క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే పడినా.. తెలంగాణ ప్రగతిలో కొంత క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడింది. అదే ఆయనకు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కారణమైందని అంటారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజ
యం సాధించి కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఈటలను ఆయన దూరం పెట్టారు. కేబినెట్ లో ఇవ్వలేదు. అయితే . ఆ తరువాత విస్తరణ సమయంలో అనివార్యంలో ఈటలను కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ, భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు .దీంతో పొమ్మన లేక పొగబెడుతున్నారని గ్రహించిన ఈటల ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీ గూటికి చేరడమేమిటన్న విస్మయం అప్పట్లో సర్వత్రా వ్యక్తమైంది. ఇది జరిగిన కొన్నాళ్లకే ఈటల తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. అధికార బీఆర్ఎస్ ఎన్ని విధాలుగా ఈటల విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం సాధించలేకపోయి చతికిల పడింది. నియోజకవర్గంలో బీసీలలో తనకున్న పట్టును ఈటల హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో 23, 855 ఓట్ల మెజారిటీతో గెలవడం ద్వారా నిరూపించుకున్నారు.
బీజేపీ అభ్యర్థిగా ఆ ఉప ఎన్నికలో విజయం సాధించినా.. ఈ గెలుపు మాత్రం పూర్తిగా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. అయితే తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా బరిలో నిలబడ్డారు. సరే ఈటల రాజేందర్ వర్గీయులు కూడా బీజేపీ మద్దతుదారులుగా పోటీలో నిలిచారు. అయితే సర్పంచులుగా గెలిచిన వారు బండి సంజయ్ మద్దతుదారులే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా వేదికగా ఈటల వర్గీయుల ఓటమిని ప్రస్తావిస్తూ, వారెవరికీ బీజేపీ మద్దతు ఇవ్వలేదు, ఈటల స్వయంగా వారిని నిలబెట్టారన్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. శనివారం (డిసెంబర్ 12) మీడియాతో మాట్లాడిన ఆయన ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో, ఉండాలో ప్రజలే తేల్చుకుంటారనీ, కాలమే అన్నీ నిర్ణయిస్తుందని అన్నారు. పంచాయతీ ఎన్నికలలో మిగిలిన రెండు విడతలూ పూర్తయిన తరువాత అన్ని విషయాలూ వివరంగా చెబుతానన్న ఈటల ఈ సారి పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే రెడీ అయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు.