English | Telugu

నల్గొండ డాక్టర్ ప్రాణం తీసిన బ్రిటన్ లాక్ డౌన్

డాక్టర్ గోవర్ధనరెడ్డి. లండన్ వెళ్ళే చాలామంది తెలుగువాళ్ళకు ఆయన అక్కడ కేరాఫ్ అడ్రస్. నల్గొండ జిల్లా వాసి. వైద్యవిద్యలో పై చదువుల కోసం లండన్ వెళ్లి స్థిరపడి అక్కడే యాభయ్ ఏళ్ళకుపైగా వుంటున్నారు. లంకంత ఇల్లు. పెళ్లి చేసుకోలేదు. ఏడాదికోమారు హైదరాబాదు వచ్చి స్నేహితులను కలిసి తిరిగి వెళ్ళడం ఆనవాయితీ. ఫిబ్రవరి చివరివారంలో డాక్టర్ వెంకటరెడ్డి (మిర్యాలగూడ డాక్టరు గారు) ఇంట్లో ఓ సాయంత్రం అయన తన మిత్రులను కలుసుకున్నారు . ఒకళ్ళా ఇద్దరా దాదాపు పదిహేను ఇరవై మందిమి. డాక్టర్ గోవర్ధన రెడ్డిని చివరిసారి చూసింది అప్పుడే, అంటూ సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తరువాత వారానికే ఆయన లండన్ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు తలలో ఒక బొడిప లాంటిది వచ్చింది. పోయేది ఇంగ్లాండ్. అక్కడ వైద్యానికి కరువా అంటూ ధీమా. పైగా స్వయంగా ఆయనే డాక్టరు. లండన్ లో చూపించుకుంటే అన్ని పరీక్షలు చేసి కేన్సర్ అని తేల్చారు. వెంటనే కీమో తెరపి మొదలు పెట్టారు. కిందటి వారం కీమో రెండో సెషన్. ఒక రోజు ముందు హాస్పిటల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోను చేస్తారు. దానికోసం రెండు ఫోను నెంబర్లు ఇవ్వాలి. ఈలోగా దురదృష్టం కరోనా కమ్మేసింది. ఎక్కడ చూసినా లాక్ డౌన్. స్నేహితులు చాలామంది వున్నా ఎవ్వరూ ఇళ్లు వదిలి బయటకు కదలలేని పరిస్తితి. అంచేత తన పొరుగు ఇంటివాళ్ళ నెంబరు ఇచ్చారు.
కీమో సెషన్ నాడు గుర్తు చేయడానికి ఆస్పత్రి వాళ్ళు ఫోన్ చేసారు. ఒకటికి పదిసార్లు ప్రయత్నించినా ఇటునుంచి జవాబు లేదు. దాంతో వాళ్ళు ఆయన పొరుగింటి వారికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి చూసారు. లోపల నుంచి అలికిడిలేదు. పోలీసులకు తెలియపరిచారు. వాళ్ళు వచ్చి తలుపులు తెరిపించి చూస్తే లోపల డాక్టర్ గోవర్ధన్ రెడ్డి అచేతనంగా పడివున్నారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. మరునాడు ప్రాణం పోయిందని నిర్ధారించారు.
హైదరాబాదుకు కబురు అందింది, కరోనా కారణంగా ఇక్కడి వాళ్ళు కదలలేని పరిస్తితి. ఇక్కడికి తీసుకురాలేని పరిస్తితి. చివరికి అలా ముగిసిపోయింది డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి జీవితం అంటూ, ఆయన సన్నిహితులు వాపోయారు. డాక్టర్ గోవర్ధన రెడ్డి వస్తుతః సౌమ్యులు. ఆ రోజు వారితో గడిపింది కొద్ది గంటలే అయినా త్వరగా మరచిపోలేని వ్యక్తిత్వమని భండారు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ( ఫోటో లో తెల్ల లాల్చీ తో ఉన్నది డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, లండన్ లో ఆయన ఇంటి బయట, తన మిత్రులతో తీయించుకున్న ఫోటో )