English | Telugu
ఒట్టి మాటలే.. అమెరికా సైనికులు మరణించలేదని తేల్చిన ట్రంప్
Updated : Jan 9, 2020
ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసిం సులేమాణి హత్యతో ఇరాన్ అమెరికాల మధ్య ముదిరిన ఉద్రిక్తతలు.. ఇరాన్ క్షిపణి దాడులతో మరింత ముదిరాయి. ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు చేసే అవకాశముందని సర్వత్రా భావిస్తున్న సమయంలో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాక్ లో అమెరికాకు చెందిన ఆలసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్ ల పై డజనుకు పైగా క్షిపణులతో దాడి చేశామని 80 మంది అమెరికన్ లు మృతి చెందారని ఇరాన్ ప్రకటించగా అంతా వట్టిదేనని ట్రంప్ తేల్చారు.
అమెరికా హెలికాప్టర్లు మిలిటరీ పరికరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించారు. కానీ స్వల్ప నష్టం తప్ప తమ దేశానికి చెందిన ఒక్క సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని ట్రంప్ హెచ్చరించారు. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం పై విమర్శలు గుప్పించిన ట్రంప్ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, చైనా ఆ ఒప్పందం నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ పై విమర్శలు గుప్పిస్తూనే ట్రంప్ ఆ దేశానికి శాంతి హస్తాన్ని చాటారు. అటు అమెరికా ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వీటిని తగ్గించేందుకు భారత్ ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని భారత్ లోని ఇరాన్ రాయబారి అలీ చేగాని అన్నారు.