English | Telugu
అలా ఇచ్చారు.. ఇలా తీసుకున్నారు! టీఎస్ ఉద్యోగుల నిరాశ
Updated : Oct 23, 2020
దసరా ముందు డీఏ పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగులు ఊరట చెందారు. దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించడాన్ని స్వాగతించారు. అయితే తెలంగాణ ఉద్యోగుల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. వరద బాధితుల సహాయం కోసం విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేతనం కట్ చేస్తూ మరో నిర్ణయం వెలువడింది. సర్కార్ నిర్ణయంతో తమ సంతోషం కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయిందని ఉద్యోగులు ఢీలా పడ్డారు. ప్రభుత్వం ఇలా ప్రకటించి.. అలా తీసుకున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు.
ప్రభుత్వానికి ఒక రోజు వేతనం ఇవ్వాలన్న జేఏసీ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ ఒక రోజు వేతనాన్ని ఎలా పణంగా పెట్టారంటూ కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఓపెన్ లెటర్ కూడా విడుదల చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా ఉన్నా.. జేఏసీ ఎందుకు ప్రశ్నించడం లేదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు ప్రశ్నించారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడిన.. ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గ్రామ రెవిన్యూ సంఘాల బాటలోనే మరికొన్ని సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపాయి.