English | Telugu

ఫేస్‌బుక్ చీఫ్‌ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ

భారత్ లో బీజేపీకి ఫేస్‌బుక్ మ‌ద్ద‌తుగా ప‌నిచేస్తోందంటూ అమెరికా వార్తా సంస్థ ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నం నేపథ్యంలో ఫేస్‌బుక్ చీఫ్‌ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రాసిన క‌థ‌నంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది. త‌మ డిమాండ్‌కు ఇత‌ర రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని తెలిపింది.

ఈ మేర‌కు కాంగ్రెస్‌ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్ ఓన‌ర్ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు లేఖ రాశారు. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను అనుమతించేందుకు ఫేస్‌బుక్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంఖి దాస్‌ బీజేపీకి పావులా మారారని లేఖలో కాంగ్రెస్‌ ఆరోపించింది. భారత్ లో 40 కోట్ల మంది ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగాదారులు ఉన్నార‌ని, వారంద‌ని న‌మ్మ‌కాన్ని తిరిగి పొందాంటే నిష్పాక్షిక విచార‌ణ జ‌ర‌పాల‌ని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది.

కేసీ వేణుగోపాల్ రాసిన లేఖ‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమ‌తించ‌బోమ‌ని, దీనిపై భార‌తీయులంద‌రూ ప్రశ్నించాలని రాహుల్‌ పేర్కొన్నారు.