English | Telugu

కర్నూల్ జిల్లా వైసిపిలో ఏం జరుగుతుంది?

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ముసలం మరింత ముదురుతోంది. ఆ నియోజక వర్గ ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పై కేసు నమోదవడం పై స్థానికంగా చర్చ జరగుతోంది. ఇటీవల జరిగిన విద్యాకమిటీల ఎన్నికలు ఎమ్మెల్యే ఆర్ధర్ నియోజక వర్గ ఇన్ చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య మరింత చిచ్చు రేపాయి. ఈ ఘటన పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెరుకుచర్ల రఘురామయ్య సీరియస్ గా స్పందించారు. అధికార పార్టీ నేతల వర్గీయుల మధ్య ఇలాంటి గొడవలు జరగడం ఏమిటనే చర్చకు దారి తీసింది. తన సన్నిహితుడు వెంకట్ రెడ్డి పై జరిగిన దాడిని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ ఖండించారు. జరిగిన ఘటనను వర్గాలకు పార్టీలకు ముడిపెట్టొద్దని ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని అభివృద్ధినే తమ పార్టీ ధ్యేయమని ఆయన అన్నారు. పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని అందరూ కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. నందికొట్కూరు నియోజక వర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని ఆర్ధర్ చెప్పుకొచ్చారు.

మరోవైపు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందన ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన అనుచరులు పన్నెండు మంది పై నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని గుట్టుగా రిమాండ్ కి పంపడం ఆర్ధర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయుల మధ్య ఉన్న చిచ్చుని మరింత రాజేసిందని అంత అనుకుంటున్నారు. వెంకట్ రెడ్డి పై దాడి కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పైన కేసు నమోదు కావడం సంచలనం రేపింది. కేసులో ఏ 13 నిందితుడిగా ఆయన పేరు చేర్చారని అయితే దాన్ని ఏ 8 గా మార్చేందుకు కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారనే చర్చ సిద్ధార్థరెడ్డి వర్గంలో సెగలు రేపింది. నందికొట్కూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పై కేసు నమోదు అయ్యేసరికి నియోజకవర్గంలోని ముఖ్య నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదిరిన టాక్ బాగా వినిపిస్తోంది. నందికొట్కూరులో త్వరలో భారీ జన సమీకరణతో బహిరంగ సభ పెట్టి పార్టీ పవర్ ఏంటో చూపిస్తానని కొద్ది రోజుల క్రితం కర్నూలులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పారు. ఆయన ప్రకటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఆనందం కలిగించింది. త్వరలో ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒకే వేదిక పై రానున్నారని భావిస్తున్న క్రమంలో విద్యా కమిటీ ఎన్నికలు గొడవలకు దారి తీశాయి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి అన్న ప్రచారం జరుగుతోంది.

నందికొట్కూరు నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడం మంచిదని వారు కోరారు. దీనితో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు త్వరలోనే ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లి రాజీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పార్టీ అధినేత జగన్ వీరిద్దరి మధ్య మరింతగా ముదిరిన విభేదాలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.