English | Telugu
కదలని కారు.. రోడ్డుపైనే 20 నిమిషాలు! బాబు భద్రత పట్టని ఏపీ సర్కార్
Updated : Nov 13, 2020
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారులో సాంకేతిక లోపం తలెత్తింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు నార్కట్ పల్లి సమీపంలోకి రాగానే మొరాయించింది. కారు ఎంతకూ కదలకపోవడంతో 20 నిమిషాల పాటు హైవేపైనే ఉండిపోయారు చంద్రబాబు. దీంతో మరో బులెట్ ప్రూఫ్ వెహికల్ లో హైదరాబాద్ కు వెళ్లిపోయారు చంద్రబాబు.
ఇటీవల కాలంలో చంద్రబాబు కాన్వాయ్ లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని తెలుస్తోంది. ప్రతి 20వేల కిలోమీటర్లు కు ఒకసారి కారు క్లచ్ ప్లేట్స్ మార్చాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 60 వేల కిలోమీటర్లు తిరిగింది చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం. 20 కిలోమీటర్లు తిరగగానే క్లచ్ ప్లేట్స్ మార్చాల్సి ఉండగా.. 60 వేల కిలోమీటర్లు తిరిగినా మార్చకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జడ్ కేటగిరి సెక్యూరిటీలో ఉన్నారు. ఆయనకు ప్రభుత్వమే పూర్తి భద్రత కల్పించాల్సి ఉంటుంది. అయితే కావాలనే చంద్రబాబు కాన్వాయ్ లోని వెహికిల్స్ ను మార్చడం లేదని, డొక్కు వాహనాలనే కేటాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాని ఆయన ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో సాంకేతిక సమస్యలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు.