English | Telugu
నాకు, మా ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదు.. బ్రెజిల్ అధ్యక్షుడి మరో వితండవాదం
Updated : Nov 27, 2020
ఇది ఇలా ఉండగా ఒకటి రెండు నెలలలో కరోనా వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్ ఎలా అందించాలని తలమునకలవుతున్నాయి. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు మాత్రం మా ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదని ప్రకటించాడు. అసలు తాను కూడా వ్యాక్సిన్ తీసుకోనని.. అంతేకాకుండా అది తన హక్కని సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనాను ఎదుర్కొనే అంశంలో మొదటి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న బోల్సొనారో.. వ్యాక్సిన్ తమ ప్రజలకు అవసరం లేదు కానీ, తన శునకానికి మాత్రమే అవసరమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
అంతేకాకుండా గతంలో మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదని గ్యారంటీ ఏంటని.. అసలు దీనికి స్పష్టమైన ప్రూఫ్ లు లేవని అడ్డంగా వాదించిన గొప్ప అధ్యక్షుడు బోల్సనారో. అంతకు ముందు ఆయనకు కరోనా సోకిన సంగతి ప్రకటించిన సందర్భంలో కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఏమాత్రం దూరం పాటించకుండా మాస్క్ తీసి మరీ తాను కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అక్కడ ఉన్న విలేకరులు హడలిపోయారు. బోల్సనారో వితండ వాదంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాలలో బ్రెజిల్ ది రెండో స్థానం కావడం ఇక్కడ గమనార్హం. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆయన హక్కు అయన ఇష్టం దానిని ఎవరు కాదనలేరు. అదేసమయంలో ప్రజలకు కూడా తమను తాము మహమ్మారి నుండి కాపాడుకునే హక్కు ఉందనే విషయాన్ని బోల్సనారో మర్చిపోయి ప్రవర్తించడం దారుణం.