English | Telugu
అంగరంగ వైభవంగా శ్రీ వారి ఐదవ రోజు బ్రహ్మోత్సవాలు...
Updated : Oct 5, 2019
తిరుమల పేరు తలిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయి. కోనేటి రాయుడిని దర్శిస్తే చాలు సర్వ కష్టాలు తొలగిపోతాయి. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సేవలు అతి ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైంది గరుడ సేవ. గరుడ వాహనం పై శ్రీ మహావిష్ణువుని తిలకిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. అనేక విధాలుగా ఆ శ్రీమన్నారాయణుని సేవించే వైనతేయడు ఇవాళ వాహనంగా మారి శ్రీవారిని తన భుజస్కంధాల మీద ఎక్కించుకుని నాలుగు మాడవీధుల్లో విహరించబోతున్నాడు. ఈ ఉదయం మోహినీ అవతారం రూపంలో మాధవుడ్ని తిలకించి పులకించిపోయిన భక్తుల రాత్రికి గరుడవాహన సేవను వీక్షించేందుకు తిరుమలకు బారులు కడుతున్నారు. మహోత్కృష్టమైన గరుడ సేవలో పాల్గొనేందుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.ముక్తిని ప్రసాదించే శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలులో పాల్గొని తరిస్తున్న భక్తులు గరుడవాహనసేవను తిలకించేందుకు వేచి చూస్తున్నారు. లక్షగొంతుకల ఒక్కటే జపిస్తున్న గోవింద నామాలతో గిరులు తరులు తరించిపోతున్నాయి.
ఆ వేంకటనాథుడు కూడా తన వైభవాన్ని చూసి తానే పులకించి పోతాడు అన్నట్టుగా ఉంది. మేళాలు తాళాలు చెక్క భజనలు దేవతా మూర్తుల రూపాలు, ఒకటేమిటి సమస్త సంస్కృతి తిరుమాఢ వీధుల్లో కన్పిస్తోంది. గరుత్మంతుడు వేదస్వరూపుడు ప్రతి రోజూ ఉభయ దేవేరులతో కలిసి మాడవీధులకు విచ్చేసే శ్రీనివాసుడు ఒంటరిగా వైనదేయుడుని అధిరోహించి అనుగ్రహించనున్నారు. గరుడ సేవ సందర్భంగా తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన తులసి మాలలు పుష్పమాలికాలను గరుడ వాహనం పై విహరించి శ్రీవారికి అలంకరించటం పరిపాటి. అలాగే నిత్యం మూలమూర్తికి అలంకరించే మకర కంఠి, సహస్రనామ మాల, లక్ష్మీహారాలని కూడా స్వామి వారికి అలంకరించబోతున్నారు. గజ మాలలతో గోపికా వల్లభుడు తిరువీధుల్లో భక్తుల్ని కనువిందు చేయనున్నాడు. కో అని పిలిస్తే చాలు వరాలిచ్చే దేవుడు ఆ కోనేటి రాయుడు అభయముద్రతో అనుగ్రహిస్తాడు శరణు వేడితే చాలు దరిచేరి అండగా ఉంటాడు ఆపదల్లో ఉన్నవారు ఆర్తితో పిలిస్తే చాలు శంఖ చక్ర ధారియై భక్తుల చెంతకు వస్తాడు.
గరుడసేవలో పరమార్థం ఇదే ఇందుకు ఉదాహరణగా గజేంద్ర మోక్షాన్ని ఉదహరిస్తారు. అలాంటి భక్తసులభుడునికి గరుడ సేవ అంటే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇప్పటికే వీధులన్నీ భక్తులతో రద్దీగా మారాయి. భద్రతా ఏర్పాట్ల కోసం ఐదు వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. రేపు ఎల్లుండి సెలవు రోజులు కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు మూడు కిలో మీటర్ల మేర క్యూలలో భక్తులు వేచి ఉన్నారు. దీనికి తోడు ఆగి ఆగి వర్షం కూడా పడుతుండడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం దాదాపు ముప్పై గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి.బ్రహ్మోత్సవాల్లో పాల్గోనే భక్తుల సంఖ్య ఈ రెండు రోజుల్లో ఎక్కువగా ఉండవచ్చని అంచనా.