English | Telugu

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు షాక్.. ఆగ‌స్టు 5న ఏపీ, తెలంగాణ సీఎంల‌ భేటీ!

ఏపీ ప్ర‌భుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లొద్దని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లను పిలవకుండా ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆపాలని తెలంగాణ ప్ర‌భుత్వం రాసిన లేఖను కూడా ఈ మేర‌కు త‌మ లేఖ‌తో జతపరిచారు.

మరోవైపు.. కృష్ణా, గోదావరి జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం ఆగ‌స్టు 5న నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంల‌తో ఆగస్టు 5న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రెండు రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశామని, ఆ రోజున ఇద్ద‌రు సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్న స‌మాచారాన్ని తెల‌పాల‌ని లేఖ‌లో కోరారు.