English | Telugu
కర్నూల్ జిల్లా వైసిపి నేతలు హైడ్రామా...
Updated : Oct 3, 2019
కర్నూల్ జిల్లా వైసిపి నేతలు టెన్షన్ పడుతున్నారు. కారణమేమంటే ఏమి మాట్లాడాలో తెలియక ఆ జిల్లా నేతల పరిస్థితి తయారైంది. ఏం చేయాలో తెలీక ఆ నేతలు సతమతమవుతున్నారు. ఏ ప్రకటన చేస్తే ఎవరి కోపానికి గురికావలసి వస్తుందోనని మథనపడుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి అంటే కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట, మొన్నటి ఎన్నికల్లో జిల్లా క్లీన్ స్వీప్ చేసింది. ఇద్దరు ఎంపీలు, పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి గెలిచారు, ఓ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. జిల్లాలో వైసీపీకి మొదటి నుంచీ పట్టుంది. ఇద్దరు మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
రాజధాని కోసం, హై కోర్టు కోసం కర్నూలు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. విద్యార్దులు వైసీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకున్న నేతలు వారికి మద్దతిస్తున్నారు. వారి ఆవేదనలో నిజం ఉంది అని చెబుతున్నారు. రాజధానిపై విద్యార్ధుల ఆందోళన గ్రహించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే సీమలో హై కోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మనసులో ఏముంది అని మాత్రం తెలియడం లేదు. సీఎంకు తెలియకుండా ప్రకటన చేస్తే తాము ఇరుక్కుంటామని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడటం లేదని తెలుస్తోంది.ఇక రాజధాని విషయం ఏమైతుందో వేచి చూడాలి.