English | Telugu
నేతలు చెప్పినట్టు ఆడతామంటే కుదరదు.. ఏపీ హైకోర్టు తీవ్ర హెచ్చరిక
Updated : Nov 10, 2020
చిత్తూరు జిల్లా తిరుమలయప్పపల్లిలో గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ నిర్వహించకుండానే నిబంధనలకు విరుద్ధంగా.. మామిడితోపు, బండి దారికి సంబంధించిన స్థలంలో రైతు భరోసా కేంద్రం భవనం నిర్మిస్తున్నారంటూ కొండకిందపల్లికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి, యర్రసాని గోపిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ తన వాదనలు వినిపించారు. గతంలో ఇదే స్థలంలో గ్రామ సచివాలయ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. గడచిన సెప్టెంబరు 24న హైకోర్టు స్టేటస్ కో (యథాతథ స్థితి) విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా ఇప్పుడదే స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం భవనం నిర్మిస్తున్నారని.. ఈ విషయం బయటకు పొక్కితే సమస్యలు వస్తాయన్న అనుమానంతో సదరు భూమి సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా అధికారులు అక్కడ భవన నిర్మాణం ఎలా చేపడుతున్నారని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనిపైనా స్టేటస్ కో ఉత్తర్వులిస్తే.. రేపు ప్రభుత్వం మరో స్కీం ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన భవన నిర్మాణం కూడా అక్కడ చేపడతారేమోనని సందేహమా వ్యక్తం చేసింది.
ఇదే కేసులో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ చెబుతున్న స్థలంలో మొదట్లోనే గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్ర నిర్మాణం కూడా చేపట్టామన్నారు. అయితే అప్పట్లో పిటిషనర్ కేవలం గ్రామ సచివాలయంపై మాత్రమే కోర్టుకు వచ్చారని తెలిపారు. అంతేకాకుండా పిటిషనర్ చెబుతున్నట్లుగా సర్వే నంబరు ఒకటే అయినప్పటికీ.. ఆ స్థలం ఎంతో విశాలమైనదని, అందువల్ల కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రదేశంలో కాకుండా పక్కన నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ నిర్మాణం నిలిపేశారని చెప్పారు. కేవలం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం కోసం ఆ నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. ఏవి ప్రజా ప్రయోజనాలో తమకు తెలుసని.. ప్రభుత్వం చేపడుతున్న అన్ని విషయాల గురించీ తమకు తెలుసని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మీ అధికారులను సరిగా నడచుకోమని చెప్పండి. మా ఆదేశాలపై అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. అంతే కానీ.. కోర్టు ఆదేశాలను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. హైకోర్టు ఆదేశాలు జారీ చేశాక అదే భూమిలో వేరే పథకానికి సంబంధించిన భవన నిర్మాణం ఎలా చేస్తారు? ఇది కోర్టు ధిక్కారం కాదా? రాజకీయ నేతలు చెప్పినట్లుగా మీరు ఆడతామంటే కుదరదు.
ఈ వ్యవహారం పై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశిస్తాం అని కోర్టు హెచ్చరించింది. దీనిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఓ పాత కేసును గుర్తుచేస్తూ.. పట్నాలో ఒక కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు పాటించని ఓ జిల్లా మేజిస్ట్రేట్‌ను పిలిపించి.. అటు నుంచి అటే జైలుకు పంపించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని.. ఆ స్థలంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు మొదటి వారానికి వాయిదా వేసింది.