English | Telugu

ఆ జడ్జి మాకొద్దు.. హైకోర్టులో జగన్ సర్కార్ వాదన

ఏపీలో రాష్ట్ర ప్ర‌భుత్వం, న్యాయ వ్య‌వ‌స్థ మ‌ధ్య పోరు మ‌రింత ముదురుతోంది. ఇప్ప‌టికే హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ మ‌హేశ్వ‌రితో స‌హా ప‌లువురు న్యాయ‌మూర్తులను టార్గెట్ చేస్తూ సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌గా… తాజాగా మ‌రో హైకోర్టు జ‌డ్జిపై త‌మ‌కు నమ్మ‌కం లేదంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖ‌లు చేసింది. ఏపీ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన మిష‌న్ బిల్డ్ ఏపీ ప్రోగ్రాంపై దాఖ‌లైన కేసును విచారిస్తున్న జ‌స్టిస్ రాకేష్ కుమార్ ను విచార‌ణ నుండి త‌ప్పుకోవాల‌ని ఈ అఫిడవిట్ లో కోరింది. ఈ కేసును ఆయ‌న విచారిస్తే తమకు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని ఆ పిటిష‌న్ లో పేర్కొంది.

ఈ కేసు ను పూర్తిగా విచారించకుండానే... రాష్ట్రంలో రాజ్యంగ వ్య‌వ‌స్థ‌లు విచ్చిన్నమయ్యాయ‌ని జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేక కామెంట్ చేశార‌ని… ఆయ‌నే ఈ కేసును విచారిస్తే త‌మకు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని ప్రభుత్వం ఆ అఫిడవిట్ లో వాదించింది. ఇప్పటికే ఆక్రమణలలో.. వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులను విక్రయించాలని తాము భావించామని అయితే ఈ కేసు పై విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన న్యాయమూర్తి ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం… గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పేర్కొంది. కేసు విచార‌ణ చేస్తున్న న్యాయ‌మూర్తిపై న‌మ్మ‌కం లేకుంటే విచార‌ణ నుండి త‌ప్పించ‌మ‌ని కోరే అధికారం పిటిష‌న‌ర్ కు ఉంద‌ని చెప్పిన విషయాన్ని ప్ర‌స్తావించింది. ఈ కేసుపై రేపు గురువారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది.