English | Telugu

దర్శనం కోసం నమోదు చేసుకున్న 36 మంది అమ్మాయిలు.. మళ్ళీ రాజుకున్న శబరిమల చిచ్చు

దేశాన్ని కుదిపేసిన ఘటనల్లో శబరిమల అంశం ఒకటి. గతంలో అన్ని వయస్సుల మహిళల ఎంట్రీని సమర్థిస్తూ సుప్రీం తీర్పునివ్వడంతో ఇక్కడ వివాదం మొదలైంది. తీర్పును వ్యతిరేకిస్తూ మహిళల ప్రవేశాన్ని భక్తులు అడ్డుకోగా.. కొంత మంది మహిళలు మొండిగా అయ్యప్ప దర్శనానికి ముందుకెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ అంశానికి రాజకీయ రంగు పులుముకోవటంతో అది మరింత రచ్చకు కారణమైంది. ఇప్పుడు మళ్లీ శబరిమల కేంద్రంగా వివాదం రాజుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

తాజాగా శబరిమల పై సుప్రీం కోర్టు తీర్పు ఆందోళన కలిగిస్తుంది. గత తీర్పు పై స్టే ఇవ్వాలని న్యాయస్థానం శబరిమలై ఘటనను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రవేశానికి పలువురు మహిళలు ముందుకొస్తున్నారు. రేపు శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్. గత ఏడాది నవంబర్ లో అయ్యప్ప ఆలయంలోకి కొందరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా శబరిమలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ సమయంలోనే తృప్తి దేశాయి సైతం శబరిమలై వెళ్ళేందుకు విఫలయత్నం చేశారు.

శబరిమల ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోవడం కోసం 36 మంది మహిళలు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడటానికి కొద్ది సమయం ముందే ఈ రిజిస్ర్టేషన్ జరిగినట్లు తెలుస్తుంది. గతంలో కోర్టు తీర్పు నిచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి 2న ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. గత ఏడాది కూడా నిషేధిత వయస్సు గల 740 మంది మహిళలు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ ఆన్ లైన్ నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరించిన తరువాత వారి ఇళ్లకు వెళ్లి వారు తీర్థయాత్రకు రావడం లేదని కన్ఫమ్ చేసుకున్నారు.

ఇక మండల పూజ కోసం అయ్యప్ప ఆలయం రేపు తేరుచుకోనుంది. ఈ నేపధ్యంలో శబరిమల భద్రతా బలగాల నీడలోకి వెళ్ళింది. శబరిమలలో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పది వేలకు పైగా పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. 24 మంది ఎస్పీ ర్యాంకు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.112 డీఎస్పీ లు, 264 మంది సీఐలు,1000 మంది ఎస్సైలు,8402 సివిల్ పోలీసు బలగాలు మోహరించారు. శబరిమలలో ప్రత్యేకంగా 307 మంది మహిళా అధికారులకు విధులు అప్పగించారు. భద్రత లో 30 మంది మహిళా సీఐలు, ఎస్సైలను నియమించారు. ఈ నెల ముప్పై వరకు సన్నిధానం చుట్టూ 2550 మంది పహారా కాయనున్నారు. 24 గంటలూ ఇద్దరు ఎస్పీ ర్యాంక్ అధికారులు పర్యవేక్షించనున్నారు. రెండవ విడతలో నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు 2539 మంది అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. సన్నిధానం, నీలక్కల్, పంబా పరిసరాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.