English | Telugu
యూపీలో పసిడి పంట.. 3,500 టన్నుల బంగారు గనులు!!
Updated : Feb 22, 2020
దేశంలోనే అతి పెద్ద బంగారు గనిని ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో గుర్తించారు. ఈ జిల్లాలోని సోన్ పహాడీ ప్రాంతంలో 2,700 టన్నులు, హార్ది ప్రాంతంలో మరో 650 టన్నుల బంగారం కలిపి మొత్తంగా 3,350 టన్నుల బంగారు నిక్షేపాలు గుర్తించినట్టుగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లోని కొండల దిగువన.. బంగారంతోపాటు ఇనుము, పొటాషియం వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 'ఉత్తరప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్' వారితో కలిసి ఎన్నో ఏళ్లుగా బంగారు గనుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే వారి శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం లభించింది. సోన్ భద్ర జిల్లాలో 3,350 టన్నుల బంగారు ఖనిజాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో బంగారు ఖనిజాలున్నట్టు 2012 లోనే శాస్త్రవేత్తలు గుర్తించినప్పటికీ అది ఇప్పుడు నిజమైంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మైనింగ్ ఆఫీసర్ కె.కె.రాయ్ నిర్ధారించారు. ప్రభుత్వం ఈ బంగారు గనులను మైనింగ్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
కాగా, మన దేశంలో ప్రస్తుతం నాలుగు బంగారు గనులు ఉన్నాయి. అందులో మూడు కర్ణాటకలో ఉండగా, ఒకటి జార్ఖండ్ లో ఉంది. తాజాగా యూపీలో గుర్తించిన గని.. వాటన్నింటికన్నా చాలా పెద్దది. ఆ నాలుగు బంగారు గనులు కలిపినా కూడా.. ఇప్పుడు యూపీలో గుర్తించిన గనిలోనే ఎక్కువ బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.