English | Telugu

మొత్తం సైన్యాన్ని ఢిల్లీలో మోహరించిన బీజేపీ... ఒక్కడ్ని ఓడించేందుకు కమలదళం తిప్పలు...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ మధ్యే సాగుతోంది. దాంతో, ఆప్ అండ్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, సర్వే సంస్థలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతున్నా... ఈసారి మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అందుకే, సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న కమలనాథులు... టాప్ లీడర్స్ ను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది.

కేజ్రీవాల్ ను ఎలాగైనాసరే ఢిల్లీ గద్దె పైనుంచి కిందికి దింపాలనుకుంటున్న బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సర్వేలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతుండటంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టాప్ లీడర్స్ అందర్నీ బీజేపీ రంగంలోకి దించుతోంది. ఏకంగా 11మంది ముఖ్యమంత్రులు, 59మంది కేంద్ర మంత్రులు, 200మంది ఎంపీలు, 1000మందికి పైగా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి ఢిల్లీ గల్లీల్లో ప్రచారం చేయిస్తోంది. కాషాయ ముఖ్యమంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఎంపీలు, 15మంది ఎమ్మెల్యేల చొప్పున ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్న బీజేపీ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకుండా అందర్నీ కలిసేలా ప్రచారం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులైతే బూతుల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గైడెన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా... లక్షన్నర మంది బీజేపీ సైనికులు కూడా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.

ఇక, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ అయితే, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను కోరుతున్నారు.